Thursday, 27 June 2013
Devadas movie still

 'దేవదాసు' 60వ వసంతంలోకి అడుగుపెట్టాడు. కొన్ని కథలకు కాలదోషం ఉండదు. అటువ ంటి కథలు ఎప్పుడు తెరకెక్కినా ఆదరణ ఉంటుంది. బెంగాలీ రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ రాసిన 'దేవదాసు' నవల కూడా అటువంటిదే. శరత్ చాలా నవలలు రాసినా వాటిల్లో ముఖ్యమైంది 'దేవదాసు' నవలే. ఈ నవలతోనే ఈ బెంగాలీబాబు తెలుగునాట ప్రసిద్ధులయ్యారు. ఆ నవలలో ఉన్నంత స్పష్టత, ఏకాగ్రత మరే నవలలో లేకపోవడం, శరత్‌బాబు ఆ తరువాతి కాలంలో ఆదర్శవాదిగా మారడం, పాత్ర చిత్రణలో వైవిధ్యం తగ్గి తత్వచర్చలు ఎక్కువ కావడం వల్ల 'దేవదాసు'లా ఆయన మిగిలిన నవలలు ప్రజాదరణ పొందలేకపోయాయి. బెంగాలీ సాహిత్యంలో సంచలనం సృష్టించిన 'దేవదాసు' సినిమాగా కూడా చరిత్ర సృష్టించింది. ఇలా తెలుగు సహా 12 చిత్రాలకు చిత్రాలకు జన్మ ఇచ్చిన భారతీయ సాంఘిక సాంఘిక నవల మరొకటి లేదు. అంతేకాదు ఇద్దరు హీరోయిన్ల ఫార్ములాకి తెరతీసిన తొలి సినిమా కూడా దేవదాసే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అంతకుముందు కొన్ని బెంగాలీ నవలల ఆధారంగా కొన్ని సినిమాలు వచ్చాయి.

అయితే మాతృకలో పెద్దగా మార్పులు చేయకుండా దాని అతి దగ్గరగా తీయడం వల్లే 'దేవదాసు' తెలుగువారిని సైతం ఆకట్టుకొందని అనేవారూ లేకపోలేదు. అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ తొలినాళ్లలో ఆయన నటనని శిఖరాయమానం చేసిన చిత్రమిది. కరుణరసపూరితమైన దేవదాసు పాత్రను సాటిలేనిరీతిలో అక్కినేని పోషించి శరత్ ఊహలకు జీవం పోశారు. చరిత్రలో గొప్ప క్లాసిక్‌గా నిలిచిన 'దేవదాసు' చిత్రం విడుదలై నేటికి 60 ఏళ్లు. ఈ సందర్భంగా ఆ చిత్రవిశేషాలు మరోసారి...


'లైలామజ్ను'లా 'దేవదాసు' కూడా ప్రపంచ ప్రసిద్ధి పొందిన ప్రేమకథ. చిన్నతనం నుంచి ప్రేమించుకున్న యువతీయువకుల ప్రేమ వారి తల్లితండ్రుల మూర్ఖత్వం వల్ల విఫలం కావడం ఈ రెండు చిత్రాల్లోని కథావస్తువు. అయితే పాత్రల చిత్రణలో రెంటికీ చాలా తేడా కనిపిస్తుంది. 'లైలామజ్ను'లో లైలని, ఖైస్‌ని కలవకుండా చెయ్యడానికి తల్లితండ్రులు, సంఘం, ప్రకృతి శక్తులు ఏకమయ్యారనిపిస్తుంది. కానీ 'దేవదాసు' కథ అలా కాదు. దేవదాసు చపలచిత్తుడవడం, పార్వతి అభిమానవతి కావడం వల్ల వారి కలయిక అసాధ్యమైంది. మరో పెద్ద తేడా ఏమిటంటే.. లైలా, ఖైస్ మనస్తత్వాలు ఒక్కటే. కానీ పార్వతి, దేవదాసు మెంటాలిటీ భిన్నమైంది. దేవదాసుని పూర్తిగా మరిచిపోలేకపోయినా గుండె దిటవు చేసుకుని రెండో పెళ్లి భర్తతో రాజీపడి సంసారం చేయగలిగింది. కానీ దేవదాసు దుర్బలుడు కావడంతో మద్యానికి బానిసై జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుని అత్యంత విషాదకరంగా కన్నుమూశాడు. ఇటువంటి విషాదాంత కథను తెరకెక్కించడానికి నిర్మాతకి ధైర్యం కావాలి. ఆ కథకు న్యాయం చేయగల దర్శకుడు, నటీనటులు కావాలి. ఆ ధైర్యం నిర్మాత డి.ఎల్.నారాయణకు ఉండటంవల్లే వద్దని శ్రేయోభిలాషులంతా వారించినా వినకుండా 'దేవదాసు' కథ మీదున్న మమకారంతో మొండిధైర్యంతో ఆ సినిమా తీశారు. ఆయనకు దర్శకుడు వేదాంతం రాఘవయ్య, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి అండగా నిలిచారు. ఈ నలుగురూ నవలకి న్యాయం చేయడంవల్లే 'క్లాసిక్'గా 'దేవదాసు' చిత్రం ఇప్పటికీ కితాబులందుకుంటోంది.


విమర్శలను లెక్కచేయని అక్కినేని
'దేవదాసు' గా అక్కినేని నటిస్తున్నారనే వార్త పరిశ్రమ వర్గాల్లో కల్లోలం రేపింది. ఆ పాత్రకు ఆయన పనికిరాడు అని చాలామంది బాహాటంగానే అనేశారు. ఆ విమర్శల్ని ఛాలెంజ్‌గా తీసుకుని తను తప్ప మరెవరూ ఆ పాత్ర చేయలేరనిపించే విధంగా నటించి చూపించి విమర్శకుల నోళ్లు మూయించారు అక్కినేని. ఆయన నట జీవితం పదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో వచ్చిన 'దేవదాసు' చిత్రం అక్కినేనిని గొప్పనటునిగా మరోసారి ఆవిష్కరించింది. మద్యం రుచే ఎరుగని వ్యక్తి పచ్చి తాగుబోతు దేవదాసు పాత్రని పోషించడం సాధారణమైన విషయమేం కాదు. ఎంతో సాధన చేసి అనితరసాధ్యమైన రీతిలో ఆ పాత్రను పోషించారు అక్కినేని.
మారిన పార్వతి
ఈ సినిమాలో పార్వతి పాత్రకు మొదట అనుకున్న నటి 'షావుకారు'జానకి. ఆమెకి అడ్వాన్స్ ఇవ్వడమే కాకుండా మేకప్ టెస్ట్ చేసి, కాస్ట్యూమ్స్ అవీ సిద్ధం చేశారు కూడా. తీరా షూటింగ్‌కి వెళ్లబోయే సమయనాకి ఏమయిందో ఏమో జానకిని తొలగించి సావిత్రిని పార్వతి పాత్రకు ఎంపిక చేశారు. నటిగా అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న సావిత్రి ప్రతిభకు ఇది ఒక రకంగా పరీక్షే. దేవదాసు పాత్రకు అక్కినేని ఎన్నుకోవడం ఎంత రిస్కో, నటిగా ఏ మాత్రం ఇమేజ్ లేని సావిత్రిని ఎంపికచేయడం అంతకంటే రిస్క్. నిర్మాత డి.ఎల్. నారాయణ ఈ సాహసానికి పూనుకుంటే, అక్కినేని, సావిత్రి ఛాలెంజ్‌గా తీసుకుని ఆ పాత్రలు పోషించారు. 'దేవదాసు' విడుదలైన తరువాత అక్కినేనికి ఎంత పేరు వచ్చిందో తన అద్భుత నటనతో అంత పేరు తెచ్చుకున్నారు సావిత్రి. అలాగే ఈ సందర్భంగా దర్శకుడు వేదాంతం రాఘవయ్య గురించి ప్రత్యేకంగా చెప్పితీరాలి. మూలాన్ని చెడగొట్టకుండా స్క్రీన్‌ని ఎలా రూపొందించాలో 'దేవదాసు' చిత్రాన్ని 1935లో తొలిసారిగా నిర్మించిన పి.సి.బారువా చేసి చూపించారు. ఆయన మార్గాన్నే అనుసరిస్తూ వేదాంతం రాఘవయ్య తెలుగు చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు.
తెలుగు,తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న 'దేవదాసు' చిత్రం రెండు భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. తెలుగు వెర్షన్ విడుదలైన 45 రోజుల తరువాత తమిళ వెర్షన్ విడుదల చేశారు. తమిళనాడు, సిలోన్‌లో విజయం సాధించింది. మధురై లోని చింతామణి థియేటర్‌లో 67 వారాలు మూడు ఆటలతో ప్రదర్శితమై తమిళ సినీ చరిత్రలో ఓ రికార్డ్ నెలకొల్పింది.
తెలుగు 'దేవదాసు' అనేక కేంద్రాల్లో వంద రోజులు, 125 రోజులు ఆడటమే కాకుండా 22 ఏళ్ల తరువాత తిరిగి విడుదలై హైదరాబాద్‌లో ఉదయం ఆటలతో 104 రోజులు ఆడింది.

Templateify

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae abtore veritatis et quasi architecto beatae vitae dicta sunt explicabo. Nemo enim ipsam voluptatem quia voluptas sit aspernatur aut odit aut fugit

0 comments